

ఎన్నో సవాళ్లు, అవాంతరాలను అధిగమించిన తర్వాతే వెలిగొండ ప్రాజెక్టుకు నీరు చేరిందని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రాజెక్టు కోసం భూములు, ఆస్తులు, గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల సహకారమే ఈ ఘనతకు కారణమని పేర్కొంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జలవనరుల శాఖపై జరిగిన తొలి సమావేశంలోనే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పూర్తి కాకపోవడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేసి, 2026 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారని వెల్లడించింది. నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటూ పనులను నిరంతరం సమీక్షించారని తెలిపింది.
గత రెండేళ్లలో కొల్లం వాగు నుంచి నీరు వచ్చేలా భారీగా మట్టిని తొలగించడం, హెడ్ రెగ్యులేటర్ల వద్ద కాంక్రీట్ పనులు చేపట్టడం, 4,924 మీటర్ల టన్నెల్‌ను పూర్తి చేయడం వంటి కీలక పనులు చేశామని ప్రభుత్వం వివరించింది. రూ.460 కోట్లతో ఫీడర్ కెనాల్ అభివృద్ధి పనులు చేపట్టి 5.3 కిలోమీటర్ల సీసీ వాల్, 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేయడంతో నీటి సరఫరా సాధ్యమైందని పేర్కొంది. నిర్వాసితులకు తమ ప్రభుత్వం రూ.900 కోట్లు చెల్లించిందని, గత ప్రభుత్వ హయాంలో వారికి సరైన పరిహారం అందలేదని ఆరోపించింది. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో గత పాలకులు ప్రజలను తప్పుదోవ పట్టించారని కూడా విమర్శించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!