

ఓ కేసులో బెయిల్ పొందేందుకు విచారణ సమయంలో తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తినంటూ ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన సుకేశ్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో సుకేశ్ వ్యవస్థాగత ద్రోహానికి పాల్పడటమే కాకుండా న్యాయవ్యవస్థ, విచారణ ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హర్షితా మిశ్ర పేర్కొన్నారు. ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తిగా నటించడం, ప్రభుత్వ ఉద్యోగిని వేధించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి నేరాలకు వేర్వేరుగా శిక్షలు విధించి, అవి వరుసగా అమలయ్యేలా కోర్టు ఆదేశించింది. అవినీతి కేసులో పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో కానిస్టేబుల్ సెల్‌ఫోన్ తీసుకుని స్పెషల్ జడ్జీకి బెదిరింపు కాల్ చేసిన ఘటనలో ఈ కేసు నమోదైంది.
మరో కీలక తీర్పులో, సహేతుకమైన, సమర్థనీయమైన కారణాలు లేకుండా ఒక వ్యక్తిని నిర్దిష్ట ప్రాంతం నుంచి బహిష్కరించే ఉత్తర్వులు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి ఆదేశాలు పౌరుల ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగు ధర్మాసనం పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌తో పాటు పొరుగు జిల్లాల నుంచి ఓ వ్యక్తిని బహిష్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బహిష్కరణకు గల కారణాలను స్పష్టంగా పేర్కొని, సంబంధిత వ్యక్తికి తెలియజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక వ్యక్తిపై పలు కేసులు నమోదై ఉన్నాయనే కారణంతో మాత్రమే బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!