

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కంపెనీలు ఏఐ ఆధారిత టెక్నాలజీలు, కొత్త ఉత్పత్తులు, ఆటోమేషన్, ప్రత్యేక ఇంజినీరింగ్ టీమ్‌లపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఏఐ, ఎంఎల్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో లేఆఫ్స్ భయం పెరుగుతోంది. వర్క్‌ప్లేస్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ బ్లైండ్ జూలై 2026లో భారత్‌కు చెందిన 1,552 మంది ప్రొఫెషనల్స్‌పై నిర్వహించిన సర్వేలో 66 శాతం ఏఐ, ఎంఎల్ ఉద్యోగులు వచ్చే 3 నుంచి 6 నెలల్లో తమ టీమ్‌లలో ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. సేల్స్, మార్కెటింగ్‌లో ఈ ఆందోళన 68 శాతంగా ఉండగా.. ప్రొడక్ట్, డిజైన్ విభాగాల్లో 65 శాతంగా నమోదైంది.
ఇంజినీర్లు ఇతర విభాగాలతో పోలిస్తే కొంత తక్కువ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పరిస్థితి పూర్తిగా భద్రంగా లేదని సర్వే సూచిస్తోంది. లేఆఫ్స్ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని 24 శాతం మంది ఇంజినీర్లు పేర్కొనగా.. మొత్తంగా 58 శాతం మంది తమ ఉద్యోగాలు ఏదో ఒక స్థాయిలో ప్రమాదంలో ఉన్నాయని భావించారు. డేటా, అనలిటిక్స్ విభాగంలో ఈ సంఖ్య 51 శాతంగా ఉంది. ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. కంపెనీలు అదే టెక్నాలజీని ఆటోమేషన్, ఖర్చుల నియంత్రణ, తక్కువ సిబ్బందితో అధిక ఉత్పాదకత కోసం వినియోగిస్తున్నాయి. దీంతో కొన్ని ఉద్యోగాల స్వరూపం మారుతుండగా, కొన్ని టీమ్‌ల పరిమాణం తగ్గుతోంది. అందువల్ల ఏఐ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు కొత్త టెక్నాలజీలు, టూల్స్, డొమైన్ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవడం కీలకంగా మారుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!