

సాధారణంగా ఆలయాలకు వెళ్లినప్పుడు దైవదర్శనం అనంతరం పులిహోర, లడ్డూ, చక్రపొంగలి వంటి ప్రసాదాలను స్వీకరిస్తుంటాం. అయితే రాజస్థాన్‌లోని బానోడా బాలాజీ ఆలయంలో మాత్రం భక్తులకు నాణేలను ప్రసాదంగా అందించడం ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ వినూత్న సంప్రదాయం కారణంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. దూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయమే కాకుండా 13 పవిత్ర ఆలయాల సమాహారంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. ఇక్కడ పంచముఖి హనుమాన్, జగన్నాథుడు, ఖటుశ్యామ్ బాబా, శ్రీ శేషావతార్ కల్లాజీ వంటి దేవతామూర్తులు కొలువుదీరారు.
పండిట్ కైలాశ్ శర్మ ఆధ్వర్యంలో నిరంతర రామాయణ పారాయణం ఈ ఆలయ ఆధ్యాత్మిక ప్రత్యేకతను మరింత పెంచుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని 200కు పైగా గ్రామాల్లో గత రెండు దశాబ్దాలుగా ఈ పారాయణ కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఆలయ విశేషాలు చెబుతున్నాయి. ఇక్కడి సిద్ధిదాత్రి దేవి ఆలయంలో నిర్వహించే 16 రోజుల నవరాత్రి ఉత్సవాలకు కూడా విశేష ఆదరణ ఉంది. భక్తులు హుండీలో సమర్పించిన నాణేలను తిరిగి ప్రసాదంగా పంచిపెట్టడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. ఈ నాణేలను ఇంట్లో భద్రపరుచుకుంటే ఐశ్వర్యం, శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. కొందరు వీటిని తమ వ్యాపారాలకు తొలి పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తుంటారు. నాణేల ప్రసాదంతో పాటు లడ్డూ, పులిహోర వంటి సంప్రదాయ ప్రసాదాలు కూడా ఇక్కడ లభిస్తాయి. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ విస్తరణ పనులు చేపడుతున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!