

అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఉన్న సవన్నా రివర్ నేషనల్ లేబొరేటరీలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం ల్యాబ్‌లోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రేడియేషన్ లీకేజీ జరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతం మీదుగా వెళ్లే వాహనాలను నిలిపివేయడంతోపాటు వాయు, రైలు మార్గాలపైనా ఆంక్షలు విధించారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదం జరిగిన భవనం వెలుపల ఎలాంటి అణు కాలుష్యం గుర్తించలేదని అధికారులు ప్రకటించారు. మంటలు అదుపులోకి రావడం, రేడియోధార్మిక కాలుష్యం ఆనవాళ్లు కనిపించకపోవడంతో రాత్రి 9.45 గంటలకు అత్యవసర పరిస్థితిని ఎత్తివేశారు. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? అగ్నిప్రమాదానికి కారణమేంటి? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. యూనియన్ ఆఫ్ కన్సర్న్‌డ్ సైంటిస్ట్స్ సంస్థకు చెందిన అణు భద్రతా విభాగం డైరెక్టర్ ఎడ్విన్ లైమన్ మాట్లాడుతూ.. ల్యాబ్ ప్రాంగణం వెలుపల కాలుష్యం లేదని ప్రకటించడం ఊరటనిచ్చే విషయమన్నారు. మంటల కారణంగా రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి వ్యాపిస్తే ప్రజలు వాటి ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంటుందని వివరించారు. సుమారు 310 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ల్యాబ్‌ను 1950ల ప్రారంభంలో ఏర్పాటు చేశారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!