

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య తీవ్రతరం అయ్యే అవకాశముందని జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మంజీరా, సింగూరు జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గడంతో వాటిపై ఆధారపడిన తొమ్మిది నియోజకవర్గాల ప్రజలకు నీటి ఎద్దడి ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం సింగూరులో 29.91 టీఎంసీల సామర్థ్యానికి గాను 3.029 టీఎంసీలు, మంజీరాలో 1.50 టీఎంసీలకు గాను కేవలం 0.19 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఆవిరి, లీకేజీలు, ఇతర అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ నిల్వలు గరిష్ఠంగా 60 రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ప్రాంతాలకు రెండు రోజులకు ఒకసారి, 40 నుంచి 45 నిమిషాల పాటు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు.
మంజీరా నీటిపై ఆధారపడిన శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, సనత్‌నగర్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంజీరా పైపులైన్లను గోదావరి ఫేజ్-1తో అనుసంధానించే పనులు చేపట్టారు. ఇందుకోసం ఎల్లంపల్లి జలాశయంలోని నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాలని జలమండలి అధికారులు నీటిపారుదల శాఖను కోరారు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో 20.17 టీఎంసీల సామర్థ్యానికి గాను 17.703 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాబోయే రెండు నెలల్లో పైపులైన్ల అనుసంధాన పనులు పూర్తయితే నగరానికి నీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యను కొంతవరకు అధిగమించవచ్చని అధికారులు భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!