

సినీ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మహిళల కోసం ‘పట్టు చీరలు’ పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. కొంతకాలం క్రితం ఓ వృద్ధురాలు ఆయనకు రాసిన లేఖ ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలిచింది. పండగలు, ప్రత్యేక వేడుకల సమయంలో పట్టుచీర కట్టుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొనలేకపోతున్నానని ఆమె తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లేఖతో చలించిపోయిన లారెన్స్ తన పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలకు పట్టుచీరలు అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఈ పథకం తొలి విడతలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఐదు వేల మంది నిరుపేద మహిళలకు పట్టుచీరలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం చెన్నైలోని రాయపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన తల్లి కణ్మణితో కలిసి పలువురు మహిళలకు లారెన్స్ స్వయంగా పట్టుచీరలను అందజేశారు. ఓ వృద్ధురాలి కోరిక నుంచి పుట్టిన ఈ ఆలోచనను పెద్ద స్థాయిలో అమలు చేస్తూ, పేద మహిళలకు పండగల వేళ పట్టుచీర కట్టుకోవాలనే కోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!