

ముంబయి ఇండియన్స్ జట్టులో 2027 ఐపీఎల్ సీజన్‌కు ముందు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన మహేల జయవర్దనే జట్టును వీడగా, సహాయక బృందంలో ఉన్న కీరన్ పొలార్డ్ ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై అనిశ్చితి నెలకొంది. అతను జట్టులో కొనసాగుతాడా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో తదుపరి సీజన్‌లో జట్టును నడిపించే బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై యాజమాన్యం చర్చిస్తున్నట్లు సమాచారం. సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ పేర్లు కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. అయితే ఒక్క సీజన్ పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించి, ఆ తర్వాత తిలక్ వర్మను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దాలని యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం, కోచింగ్ బృందంలో మార్పులు చోటుచేసుకోవడంతో యువ ఆటగాడు తిలక్ వర్మపై ఇప్పుడే కెప్టెన్సీ భారం మోపకూడదని ముంబయి యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కోచింగ్ విభాగంలో మరిన్ని మార్పులు చేస్తూ బౌలింగ్ కోచ్‌లు లసిత్ మలింగ, పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ హాప్కిన్స్‌లకు కూడా ఫ్రాంఛైజీ వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే జయవర్దనే స్థానంలో పొలార్డ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించిన నేపథ్యంలో, కొత్త సీజన్‌కు ముందు జట్టు నాయకత్వం, సహాయక సిబ్బంది విషయంలో ముంబయి ఇండియన్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!