

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి వర్చువల్‌గా 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలమని పేర్కొన్న సీఎం, 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.60,472 కోట్ల రుణాలు అందించామని తెలిపారు.
మహిళా సంఘాలు చిన్న ఉపాధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, కార్పొరేట్ తరహా సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైతే 100 ఎకరాల వరకు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డీమార్ట్, బిగ్ బజార్‌లకు పోటీగా మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం కొనసాగుతుందని, మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసిన 553 బస్సులను జూన్ 5న ప్రారంభిస్తామని వెల్లడించారు. మహిళా సంఘాలు బ్యాంకు రుణాలను వంద శాతం తిరిగి చెల్లిస్తూ ఆర్థిక క్రమశిక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నాయని సీఎం ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!