

అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రంలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని హిందూ ఆలయంపై కాల్పులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పాలటైన్ ప్రాంతానికి చెందిన అలెగ్జాండ్రోస్ పపోరాకిస్ అక్టోబరు 11న అరోరా శివారు ప్రాంతంలోని ఓ హిందూ ఆలయానికి వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆదివారం కావడంతో ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారని, ఆ సమయంలో కాల్పులు జరిపేందుకు అతడు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, అతడి రైఫిల్ జామ్ కావడంతో కాల్పులు జరగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇంటికి చేరుకున్న తర్వాత తుపాకీని ఎలా సరిచేయాలనే విషయంపై అతడు ఇంటర్నెట్లో శోధించినట్లు సమాచారం. అనంతరం తాను పనిచేసే రెస్టారెంట్లోని ఓ స్నేహితుడికి ఫోన్ చేసి తన ప్రణాళిక గురించి చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అదే రోజు సాయంత్రం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి రైఫిల్, మ్యాగజైన్లు, వందలాది తూటాలు, ఇతర ప్రమాదకర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. భారత సంతతికి చెందిన ప్రజలపై జాతి విద్వేషం, హింసకు సంబంధించిన పత్రాలను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై చికాగోలోని భారత కాన్సులేట్ ఆందోళన వ్యక్తం చేస్తూ, దాడిని అడ్డుకున్న అధికారులను అభినందించింది. భారతీయ సమాజంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కూడా హిందువులపై విద్వేషాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!