

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశీయ ఫార్మా పరిశ్రమపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు నుంచి తయారయ్యే బెంజిన్, టొల్యూన్, ఇథిలిన్ వంటి కీలక పెట్రో రసాయనాల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇవి ఆస్పిరిన్, పారాసిటమాల్, పెన్సిలిన్, యాంటీబయాటిక్స్, యాంటీహిస్టామైన్స్, సెడేటివ్స్ వంటి ముఖ్య ఔషధాల తయారీలో అవసరమైనవిగా ఉండటంతో, దేశంలో ప్రస్తుతం ఉన్న నిల్వలు కేవలం రెండు నుంచి మూడు నెలలకు మాత్రమే సరిపోతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. యుద్ధ పరిస్థితులు కొనసాగితే, చైనా నుంచి వచ్చే యాక్టివ్ ఫార్మా ఇన్గ్రిడియెంట్స్ (API) సరఫరాలో కూడా కొరత తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా తీసుకుని పెట్రో రసాయనాలను సరఫరా చేసే సంస్థలు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచడంతో ఫార్మా కంపెనీల ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరిగాయి. వ్యాధి నిర్ధారణ పరికరాల్లో ఉపయోగించే ప్లాస్టిక్ విడి భాగాల ధరలు గత రెండు వారాల్లో దాదాపు 50 శాతం పెరిగాయి. అలాగే సిరంజీలు, క్యాథెటెర్స్ తయారీలో ఉపయోగించే పీఎన్జీ గ్యాస్ ధరల పెరుగుదల కూడా వ్యయభారం పెరగడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో నిత్యావసర ఔషధాల ధరలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఫార్మా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
భారతదేశం నుంచి పెద్ద ఎత్తున జెనరిక్ ఔషధాలు, వ్యాక్సిన్లు అమెరికా, యూరప్, ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే తాజా పరిస్థితుల వల్ల ఉత్పత్తి వ్యయాలతో పాటు రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఎర్ర సముద్రం, హోర్ముజ్ జలసంధి మార్గాల బదులుగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా రవాణా జరగడంతో కంటైనర్ చార్జీలు రెండు నుంచి మూడు రెట్లు, విమాన రవాణా ఖర్చులు 15 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. రవాణా సమయం కూడా 10 నుంచి 15 రోజులు ఎక్కువగా పడుతోంది. దీంతో పాత ఒప్పంద ధరలతో ఎగుమతులు కొనసాగితే నష్టాలు తప్పవని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ముడి పదార్థాల ధరలను నియంత్రించడమే కాకుండా, రవాణా ఖర్చులపై ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!