

దేశంలోని చిన్న నగరాలు, మారుమూల ప్రాంతాలకు విమాన సర్వీసులను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అమలవుతున్న ప్రాంతీయ అనుసంధానత పథకం (ఉడాన్) ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. మారుమూల ప్రాంతాలకు నడుస్తున్న విమాన సర్వీసుల వల్ల విమానయాన సంస్థలకు ఎదురవుతున్న నష్టాలను పూడ్చేందుకు ఆర్థిక మద్దతు అందించే కొత్త ప్రణాళికకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించాల్సి ఉంది.
2016లో ప్రారంభమైన ఉడాన్ పథకం లక్ష్యం విమాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు సైతం అందుబాటు ధరల్లో అందించడం. ఈ పథకం కింద విమానంలోని సగం సీట్లపై టికెట్ ధరలకు గరిష్ఠ పరిమితి (సీలింగ్) విధించారు. అయితే ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటం, ఛార్జీలపై పరిమితుల కారణంగా కొన్ని మార్గాలు లాభదాయకంగా మారకపోవడంతో ఆయా సర్వీసులను విమానయాన సంస్థలు కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను అందిస్తోంది. విమాన ల్యాండింగ్, నావిగేషన్ ఛార్జీలపై మినహాయింపులు, సబ్సిడీలు ఈ ప్రోత్సాహకాలలో భాగంగా ఉన్నాయి.
ప్రస్తుతం ఒక్కో వాణిజ్య విమాన సర్వీసుకు ఇస్తున్న సబ్సిడీలో సుమారు 80 శాతం (రూ.6,500) కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి.
ఉడాన్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.4,352 కోట్లకు పైగా సబ్సిడీగా అందించారు. అదనంగా విమానాశ్రయాల అభివృద్ధికి రూ.4,638 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. మొత్తం 649 మార్గాల్లో ప్రస్తుతం కేవలం 60 శాతం మాత్రమే పని చేస్తున్నాయి. అలాగే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 15 ప్రాంతీయ విమానాశ్రయాలపై సుమారు రూ.900 కోట్లు ఖర్చు చేసినప్పటికీ అవి ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహించడం లేదు.
ప్రస్తుతం ఉడాన్ మార్గానికి బిడ్ గెలుచుకున్న విమానయాన సంస్థలు నాలుగు నెలల్లో సర్వీసులు ప్రారంభించాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల పాటు ఆయా మార్గాల్లో అదే సంస్థకు సర్వీసులు నిర్వహించే హక్కు ఉంటుంది. ఇకపై సబ్సిడీ వ్యవధిని ప్రస్తుత మూడేళ్లకు మించి పొడిగించే అవకాశం ఉందని సమాచారం. అలాగే మారుమూల ప్రాంతాల విమానాశ్రయాల్లో విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై తక్కువ పన్నులు, విమానాశ్రయ ఫీజుల మినహాయింపులు కొనసాగనున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!