

భారత్ సహా ప్రపంచ దేశాలపై డోనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార టారిఫ్లు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో రీఫండ్లపై గందరగోళం నెలకొంది. గతేడాది ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చిన ఈ సుంకాల ద్వారా డిసెంబరు మధ్య వరకు అమెరికా ఖజానాకు సుమారు 13,300 కోట్ల డాలర్లు (దాదాపు రూ.12 లక్షల కోట్లు) చేరినట్లు అంచనా. అయితే ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలా లేదా అన్న విషయంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే కాస్ట్కో, రెవ్లాన్, బంబుల్ బీ ఫుడ్స్ వంటి పలు కంపెనీలు రీఫండ్ల కోసం కోర్టులను ఆశ్రయించాయి.
భారత ఎగుమతిదారులకు మాత్రం నేరుగా రీఫండ్ వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సుంకాలను చెల్లించింది అమెరికాలోని దిగుమతిదారులే. ఒకవేళ రీఫండ్లు మంజూరైతే అవి ఆయా కంపెనీలకే వెళ్తాయి. భారత కంపెనీలకు ప్రత్యక్ష పరిహారం ఉండదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తీర్పుతో అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులకు మళ్లీ గిరాకీ పెరగవచ్చని అంచనా.
రీఫండ్ ప్రక్రియ కూడా తక్షణమే పూర్తయ్యేలా కనిపించడం లేదు. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సంస్థ దరఖాస్తులను పరిశీలించి చెల్లింపులు చేపట్టాల్సి ఉంటుంది. నిపుణుల ప్రకారం, ఈ ప్రక్రియకు 12-18 నెలలు పట్టే అవకాశం ఉంది. గతంలో కూడా ట్రేడ్ కేసుల్లో రీఫండ్లు చెల్లించిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఇంత భారీ మొత్తంలో రీఫండ్లు ఇవ్వడం ఇదే తొలిసారి కావచ్చు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!