

స్పామ్ కాల్స్‌ను కట్టడి చేసేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వినియోగదారులు ప్రత్యేకంగా ఫిర్యాదు చేయకపోయినా, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత వ్యవస్థల ద్వారా అనుమానాస్పద స్పామర్లుగా గుర్తించిన వారిపై టెలికం సంస్థలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సవరించిన టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ నిబంధనల ప్రకారం, స్పామర్‌గా గుర్తించిన వారి కేవైసీ వివరాలను మళ్లీ ధ్రువీకరించడంతో పాటు అవసరమైన సమాచారాన్ని ఇతర టెలికం సంస్థలతో పంచుకోవాలి. నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే టెలికం సేవలను నిలిపివేయడం లేదా కనెక్షన్లను డిస్‌కనెక్ట్ చేయడం, తీవ్రమైన సందర్భాల్లో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం వంటి చర్యలు చేపట్టవచ్చు.
ఒకే పంపినవారికి సంబంధించిన పలు కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్లు నిర్ణీత వ్యవధిలో అనుమానాస్పదంగా గుర్తించినా టెలికం సంస్థలు కలిసి చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు రూపొందించారు. మరోవైపు వినియోగదారులు తమకు అవసరం లేని ప్రమోషనల్ టెలిమార్కెటింగ్ కాల్స్‌ను స్వయంగా నిలిపివేసే అవకాశం కూడా ఉంటుంది. అన్ని కేటగిరీల ప్రమోషనల్ కమర్షియల్ కమ్యూనికేషన్లను నిలిపివేయాలంటే 1909 నంబరుకు BLOCK PROMO అని సందేశం పంపాలి. అయితే సేవలకు సంబంధించిన, లావాదేవీలకు సంబంధించిన, ప్రభుత్వ కమ్యూనికేషన్లు దీనివల్ల నిలిచిపోవు. సవరించిన నిబంధనలు దశలవారీగా అమల్లోకి రానున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!