

టాటా గ్రూప్‌లో కొనసాగుతున్న అంతర్గత చర్చల మధ్య, గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్ బోర్డు సభ్యులు మంగళవారం ముంబైలో సమావేశమయ్యారు. బాంబే హౌస్‌లో జరిగిన ఈ కీలక సమావేశంలో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్‌తో పాటు బోర్డులోని ఆరుగురు సభ్యులు పాల్గొన్నారు. ఉదయం ప్రారంభమైన సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది.
టాటా ట్రస్ట్ బోర్డులో అంతర్గత విభేదాలు, ఎయిరిండియా సహా గ్రూప్‌కు చెందిన కొత్త సంస్థల భారీ నష్టాలు, టాటా సన్స్ లిస్టింగ్‌పై నోయల్ టాటా అభిప్రాయాలు, అలాగే చంద్రశేఖరన్‌ను మూడోసారి చైర్మన్‌గా కొనసాగిస్తారా లేదా అన్న అంశాలు ఈ సమావేశానికి ప్రాధాన్యం తీసుకొచ్చాయి. సమావేశం అనంతరం బోర్డు సభ్యులు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోగా, సంస్థ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఈ సమావేశంలో ఎయిరిండియా, టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థల ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ పెట్టుబడుల అవసరాలపై సమగ్ర సమీక్ష జరిగినట్లు సమాచారం. ఆయా సంస్థల ప్రధానాధికారులు బోర్డుకు వివరాలు సమర్పించినట్లు తెలిసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ అన్‌లిస్టెడ్ సంస్థలు రూ.10,905 కోట్ల నష్టాలు చవిచూడగా, 2025-26లో నష్టాలు రూ.29,000 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే నెల 12న మరోసారి టాటా సన్స్ బోర్డు సమావేశం కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!