అంతర్జాతీయంగా అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్ల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన ‘ఐటీ సర్వీసెస్ 25 (2026)’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 25 సంస్థలతో రూపొందించిన ఈ జాబితాలో అమెరికా, భారత్ దేశాల నుంచి చెరో 8 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. గత ఎనిమిదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న యాక్సెంచర్ ఈసారి కూడా 42.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.80 లక్షల కోట్లు) బ్రాండ్ విలువతో తొలి స్థానాన్ని నిలుపుకుంది. టీసీఎస్ వరుసగా ఐదో ఏడాదీ 21.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.91 లక్షల కోట్లు) బ్రాండ్ విలువతో రెండో స్థానంలో నిలిచింది.
ఏటా సగటున 15 శాతం వృద్ధిని సాధిస్తూ గత ఆరు సంవత్సరాలుగా అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్, 16.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.48 లక్షల కోట్లు) బ్రాండ్ విలువతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. అత్యంత విశ్వసనీయమైన, నమ్మదగిన బ్రాండ్‌గా టీసీఎస్ గుర్తింపు పొందింది. ఈ జాబితాలోని టాప్ 10 సంస్థల్లో హెచ్‌సీఎల్ టెక్, విప్రో కూడా ఉన్నాయి. 12 వ స్థానంలో టెక్ మహీంద్రా ఉండగా, తదుపరి స్థానాల్లో ఎల్‌టీఐమైండ్‌ట్రీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్, హెక్సావేర్ టెక్నాలజీస్ చోటు దక్కించుకున్నాయి.
ఈ జాబితాలో ఉన్న 25 ఐటీ కంపెనీల మొత్తం బ్రాండ్ విలువ 167.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.15.05 లక్షల కోట్లు)గా ఉందని నివేదిక పేర్కొంది. క్యాప్‌జెమినీ, ఎన్‌టిటి డేటా, కాగ్నిజెంట్, ఈపామ్, జెన్‌ప్యాక్ట్ వంటి బహుళజాతి సంస్థలు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!