

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఐదోరోజూ లాభాలతో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడం మార్కెట్లకు అండగా నిలిచాయి. ఐటీ రంగ షేర్లు మినహా మిగిలిన రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, మెటల్ షేర్లు రాణించాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 2 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 1.55 శాతం చొప్పున లాభపడ్డాయి.
సెన్సెక్స్ ఉదయం 76,853.11 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైనప్పటికీ.. కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చింది. మధ్యాహ్నం ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్వల్పంగా నష్టాల్లోకి జారుకున్నా.. తిరిగి పుంజుకుని చివరకు 383.55 పాయింట్ల లాభంతో 77,301.40 వద్ద ముగిసింది. నిఫ్టీ 86.95 పాయింట్లు పెరిగి 23,897.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 94.64గా నమోదైంది. సెన్సెక్స్‌లో బీఈఎల్, టైటాన్, ఇండిగో, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడగా.. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 102 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 4,046 డాలర్ల వద్ద కొనసాగింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!