

కారు, బైక్ యజమానులకు బీమా విషయంలో ఊరట కల్పించేలా కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. డిసెంబర్ 15 నుంచి అమలుకానున్న కొత్త నిబంధనల ప్రకారం, వాహనదారులు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌తో పాటు ఇతర బీమా కవర్లను తమ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా కొనసాగనుండగా, ప్రయాణికులు, ద్విచక్ర వాహనాలపై వెనుక కూర్చునే వారికి (పిలియన్ రైడర్లు) సంబంధించిన లయబిలిటీ కవర్‌ను ఐచ్ఛికంగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే, వాహనానికి సంబంధించిన ఓన్ డ్యామేజ్ కవర్‌ను కూడా విడిగా తీసుకోవచ్చు.
కొత్త విధానం ప్రకారం, ప్రతి బీమా కవర్‌కు సంబంధించిన ప్రీమియం వివరాలను బీమా సంస్థలు విడివిడిగా వెల్లడించాలి. దీంతో వినియోగదారులు ఏ కవర్ కోసం ఎంత చెల్లిస్తున్నారో స్పష్టంగా తెలుసుకోవచ్చు. పాలసీ కొనుగోలు సమయంలో కస్టమర్ ఆప్షన్ ఫారం, ఇన్ఫర్మేషన్ షీట్‌ను కూడా బీమా సంస్థలు అందించాలి. ఇప్పటికే థర్డ్ పార్టీ పాలసీ తీసుకున్నవారు అదనపు ప్రీమియం చెల్లించి ప్రయాణికుల బీమా కవరేజీని జోడించుకోవచ్చు.
ముఖ్యమైన స్పష్టత: కొత్త విధానంలో థర్డ్ పార్టీ బీమాతో పాటు వాహన యజమాని-డ్రైవర్‌కు వ్యక్తిగత ప్రమాద బీమా కూడా తప్పనిసరి. ప్రయాణికులు, పిలియన్ రైడర్లు, అదనపు వ్యక్తిగత ప్రమాద కవరేజీ, ఓన్ డ్యామేజ్ కవర్లు ఐచ్ఛికంగా ఉంటాయి. ఈ మార్పులు ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనాలకు సంబంధించి డిసెంబర్ 15, 2026 నుంచి జారీ చేసే పాలసీలకు వర్తిస్తాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!