

బంగారం ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా పసిడికి గిరాకీ తగ్గింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది జులై–సెప్టెంబరు త్రైమాసికంలో బంగారం డిమాండ్ 29 శాతం క్షీణించి 229.8 టన్నుల నుంచి 162.5 టన్నులకు పడిపోయినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక వెల్లడించింది. అయితే ధరల పెరుగుదల కారణంగా విలువ పరంగా గిరాకీ 3 శాతం పెరిగి రూ.2,35,090 కోట్ల నుంచి రూ.2,41,900 కోట్లకు చేరింది. దిగుమతి సుంకం పెంపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే భారత్‌లో బంగారం ధర అధికంగా ఉందని నివేదిక పేర్కొంది. దీంతో స్మగ్లింగ్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. బంగారు ఆభరణాల గిరాకీ 20 శాతం తగ్గి 99.9 టన్నులకు, బిస్కెట్లు, నాణేల కొనుగోళ్లు 40 శాతం తగ్గి 55 టన్నులకు పరిమితమయ్యాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు 50 శాతం తగ్గి 5.3 టన్నులకు చేరగా, పాత బంగారం మార్పిడి 12 శాతం తగ్గి 19.2 టన్నులుగా నమోదైంది.
మరోవైపు, దేశంలోకి అధికారికంగా జరిగిన నికర బంగారం దిగుమతులు 46 శాతం తగ్గి 211.9 టన్నుల నుంచి 114.1 టన్నులకు చేరాయి. అయితే కన్సల్టెన్సీ సంస్థ మెటల్స్ ఫోకస్ అంచనాలను ఉటంకిస్తూ, అనధికారిక దిగుమతులు 3 టన్నుల నుంచి 50 టన్నులకు పెరిగినట్లు డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం సగటు ధర 3,457 డాలర్ల నుంచి 4,262 డాలర్లకు చేరగా, భారత్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,02,287 నుంచి రూ.1,48,891కు పెరిగింది. దిగుమతి సుంకం, జీఎస్‌టీని ఈ ధరల్లో కలపలేదు. అంతర్జాతీయంగా బంగారం గిరాకీ ఒక శాతం తగ్గి 1,369 టన్నులకు చేరినప్పటికీ, విలువ పరంగా 22 శాతం పెరిగి 188 బిలియన్ డాలర్లకు చేరింది. ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ భారతీయులు బంగారాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తున్నారని డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ సచిన్ జైన్ తెలిపారు. సెప్టెంబరు చివర్లో ధరలు కొంత తగ్గడంతో వాయిదా వేసుకున్న కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయని, ముఖ్యంగా పెళ్లిళ్లు, పండగల నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశీయంగా బంగారానికి 625–675 టన్నుల మేర గిరాకీ ఉండొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!