

సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే కథానాయిక సాయిపల్లవి మరోసారి తన అభిప్రాయాలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. సినిమాల్లో మేకప్ లేకుండా కనిపించడానికి గల కారణాలను వివరించారు. తన కెరీర్ ప్రారంభంలో మేకప్ విషయంలో అభద్రతా భావానికి గురయ్యానని, అయితే కాలక్రమేణా తన సహజ రూపాన్ని అంగీకరించడం నేర్చుకున్నానని చెప్పారు. ప్రేక్షకులు తెరపై వాస్తవికతను కోరుకుంటారని, అందుకే నిజ జీవితానికి దగ్గరగా ఉండే మహిళా పాత్రలను ఎంచుకుంటానని తెలిపారు. పాత్రకు, ప్రేక్షకులకు మధ్య తన రూపం అడ్డంకిగా మారకూడదని భావిస్తానన్నారు. ప్రస్తుతం లిప్‌గ్లాస్, ఐలైనర్, మాయిశ్చరైజర్ వంటి వాటిని మాత్రమే ఉపయోగిస్తానని, ఫౌండేషన్ వేసుకుంటే తనకు తానే కొత్త వ్యక్తిలా కనిపిస్తానని పేర్కొన్నారు.
‘రామాయణం’ చిత్రంలో సీత పాత్ర పోషించడం తనలో కొన్ని వ్యక్తిగత మార్పులకు కారణమైందని సాయిపల్లవి వెల్లడించారు. ఆ మార్పుల గురించి అందరికీ వివరించాల్సిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాలో సీత పాత్రపై వస్తున్న విమర్శలు తన దృష్టికి వస్తున్నాయని, ప్రతి ఒక్కరికీ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉందని పేర్కొన్నారు. అలాంటి విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని మరింత బలంగా మారాలని సూచించారు. కేవలం గ్లామర్‌కు ప్రాధాన్యమిచ్చే పాత్రలపై తనకు ఆసక్తి లేదని, మంచి పాత్రల కోసం కొన్నేళ్లపాటు ఎదురుచూశానని చెప్పారు. అందరూ ఎంచుకునే పాత్రలనే తాను కూడా చేయాలా అని ఆ సమయంలో ఆలోచించేదాన్నని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి ‘ఇంజి వెల్లం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!