

తమిళనాడులో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి, తొలి ఎన్నికల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్‌కు పాలన ప్రారంభమైన కొద్ది కాలానికే రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు, ప్రభుత్వ వ్యవహారశైలిపై న్యాయస్థానాల అసంతృప్తి, శాసనసభలో పరిమిత సంఖ్యాబలంతో కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వం ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. మహిళా కలెక్టరుకు అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్లకురిచ్చి ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బాధిత అధికారిపై కొందరు మంత్రులు ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా అధికారికే రక్షణ లేకపోతే సామాన్య మహిళల భద్రత ఎలా ఉంటుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ కేసులో ప్రభుత్వ స్పందనపై హైకోర్టు సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా, స్థానికుడిపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు తురైయూర్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ ఎం. రవిశంకర్‌పై రావడం టీవీకే ప్రభుత్వానికి మరో సమస్యగా మారింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు పెరియార్ అరివులగం గ్రంథాలయానికి పుస్తకాల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ డీఎంకే అనిశా అధికారులకు ఫిర్యాదు చేసింది. రాజకీయంగా చూస్తే, 234 స్థానాలున్న తమిళనాడు శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకే 108 స్థానాలు గెలుచుకోగా, విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో 123 మంది సభ్యుల బలంతో ప్రభుత్వం ఏర్పాటైంది. ఇటీవల ఉప ఎన్నికల విజయాలతో పార్టీ బలం 109కు చేరగా, కొళత్తూర్ ఎమ్మెల్యే వీఎస్ బాబు మరణంతో 108కు తగ్గింది. అరుళ్ విఘ్నేశ్ రాజీనామా చేస్తే ఈ సంఖ్య 107కు పడిపోతుంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న నియోజకవర్గాలతో పాటు మరిన్ని స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో, పార్టీ బలాన్ని పెంచుకోవాలన్న విజయ్ వ్యూహానికి తాజా పరిణామాలు సవాలుగా మారాయి. ప్రభుత్వ మనుగడ కోసం మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడాల్సిన పరిస్థితి మరింత బలపడుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!