

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్ఫార్మ్స్ లిమిటెడ్‌ను నిర్ణయించిన సమయానికి పబ్లిక్ ఇష్యూకు తీసుకురావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉందని సమాచారం. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు నిబంధనల సవరణల అమలు ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 2026 తొలి అర్ధభాగంలో జియోను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే.
సెబీ గత సెప్టెంబర్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఐపీఓ అనంతరం కంపెనీ మార్కెట్ విలువ రూ.5 లక్షల కోట్లకు మించి ఉంటే, కనీసం 5 శాతం వాటా విక్రయించాల్సిన పాత నిబంధనను తగ్గించి 2.5 శాతం మాత్రమే విక్రయించేందుకు అనుమతించాలనే ప్రతిపాదన చేసింది. అయితే ఈ సవరణకు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి తుది ఆమోదం రాలేదు. నిబంధనలు గెజిట్ నోటిఫికేషన్ రూపంలో వెలువడిన తర్వాతే జియో ఐపీఓ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సుమారు 170 బిలియన్ డాలర్ల విలువతో జియో ఐపీఓ దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!