

దేశీయ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తుండటంతో పాటు, భారతీయ కంపెనీలు 1200కు పైగా కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చిన నేపథ్యంలో, ఈ రంగంలోని అగ్రగామి అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో తయారీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన విమాన ఇంజిన్ తయారీ దిగ్గజం రోల్స్ రాయిస్ కూడా, బ్రిటన్ వెలుపల తమ మూడో అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జెట్ ఇంజిన్లు, నావల్ ప్రొపల్షన్, ల్యాండ్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్ వంటి పలు విభాగాల్లో భారత్‌లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు రోల్స్ రాయిస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శశి ముకుందన్ తెలిపారు. భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కార్యక్రమం కింద అభివృద్ధి చేయనున్న యుద్ధ విమానాల కోసం తదుపరి తరం ఏరో ఇంజిన్ల తయారీ తమ ప్రధాన ప్రాధాన్యమని ముకుందన్ స్పష్టం చేశారు. భారత నావికాదళ పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచేలా విద్యుత్ ప్రొపల్షన్ అవసరాలను తీర్చడంలో రోల్స్ రాయిస్ కీలక పాత్ర పోషించగలదన్నారు. ఏఎంసీఏ ఇంజిన్ కోర్‌ను నావల్ మెరైన్ ఇంజిన్‌గా మార్చడం, అలాగే ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏరో ఇంజిన్‌ను మెరైన్ ఇంజిన్‌గా మార్పు చేసే సాంకేతిక సామర్థ్యం ఉన్న కొద్ది కంపెనీల్లో రోల్స్ రాయిస్ ఒకటని ఆయన వివరించారు.
భారత్‌లో రక్షణ రంగం, పారిశ్రామిక వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, గణనీయమైన పెట్టుబడులకు సిద్ధమవుతున్నట్లు ముకుందన్ తెలిపారు. ఈ క్రమంలో రెండు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. వాటిలో ఒకటి అర్జున్ ట్యాంకుల ఇంజిన్ల తయారీకి సంబంధించినదిగా, మరొకటి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందించే కాంబాట్ వాహనాల ఇంజిన్ల అభివృద్ధికి సంబంధించినదిగా పేర్కొన్నారు. యుద్ధవిమానాల ఇంజిన్ తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!