

ఆర్బిఐ నిర్వహించిన తాజా ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు ఆమోదం తెలపడంతో పాటు, దేశ జీడీపీ వృద్ధి అంచనాలను కూడా పెంచారు. ఇందులో భాగంగా జీడీపీ వృద్ధిపై ఆర్బిఐ ఆసక్తికర వివరాలు వెల్లడించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ 8.2 శాతం వృద్ధి సాధించడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగదారుల డిమాండ్ పెరగడం జీడీపీ వృద్ధిని గరిష్ట స్థాయికి తీసుకెళ్లిందని అధికారులు తెలిపారు. ఇది గత ఆరు త్రైమాసికాల్లో అత్యధిక వృద్ధి అని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం 6.5 శాతం వృద్ధి సాధించింది.
మూడురోజులపాటు సాగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. అనంతరం RBI తాజా జీడీపీ అంచనాలను విడుదల చేసింది.
2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి Q3 వృద్ధి అంచనాను 6.4% నుంచి 7%కి పెంచగా, Q4 అంచనాను 6.2% నుంచి 6.5%కి సవరించింది.
2027 ఆర్థిక సంవత్సరంలో Q1 వృద్ధి అంచనాను 6.4% నుంచి 6.7%కి పెంచగా, Q2 వృద్ధి 6.8%గా ఉంటుందని అంచనా వేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి భాగంలో ఆదాయ పన్ను, జీఎస్టీ రేట్ల సవరణలు, ముడి చమురు ధరల తగ్గుదల, మూలధన వ్యయాల పెరుగుదల, అనుకూల ఆర్థిక పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలంగా దోహదపడ్డాయని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరించారు.
“జీఎస్టీ రేట్ల కోత, పండుగ సీజన్ కారణంగా అక్టోబర్–నవంబర్‌లో జీడీపీ వృద్ధి మరింత మెరుగైంది. ఊహించినదానికంటే బలమైన ఆర్థిక ప్రగతి నమోదైంది. జూలై–సెప్టెంబర్ కాలంలో 8.2% వృద్ధితో ఆరు త్రైమాసికాల్లో అత్యధిక స్థాయిని చేరుకుంది. జీఎస్టీ సుంకాల తగ్గింపు వినియోగదారుల డిమాండ్‌ను పెంచి వృద్ధికి బలంగా సహాయపడింది” అని గవర్నర్ తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!