

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఉదయం ట్రేడింగ్‌లో కొనుగోళ్ల జోరుతో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒక దశలో 2 వేల పాయింట్లకు పైగా లాభపడి 84,498.21 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 500 పాయింట్లకు పైగా పెరిగి 25,900 స్థాయిని అందుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు సూచీల ర్యాలీకి దోహదపడ్డాయి. మధ్యాహ్నం 12.50 గంటల సమయానికి సెన్సెక్స్ 1,339.08 పాయింట్ల లాభంతో 83,775.07 వద్ద, నిఫ్టీ 383 పాయింట్లు పెరిగి 25,733.20 వద్ద ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 30లో టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ మినహా మిగిలిన షేర్లు లాభాల్లో కొనసాగాయి.
మార్కెట్ల ర్యాలీకి పలు అంశాలు దోహదపడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండిగో వంటి అధిక వెయిటేజీ కలిగిన షేర్లలో భారీ కొనుగోళ్లు సూచీలకు బలాన్నిచ్చాయి. మరోవైపు, ఏఐ, డేటా సెంటర్లపై ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు చేస్తున్న భారీ పెట్టుబడులకు తగిన రాబడులు వస్తాయా? అన్న సందేహాలతో అంతర్జాతీయ టెక్నాలజీ షేర్లలో అమ్మకాలు పెరిగాయి. దీంతో విదేశీ సంస్థాగత మదుపర్లు భారత్ వంటి వర్ధమాన మార్కెట్లవైపు పెట్టుబడులు మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌ఐఐలు భారత మార్కెట్లలో 13.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. సోమవారం ఒక్కరోజే రూ.5,673 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. దీనికి తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 56 పైసలు బలపడి రూ.92.29 వద్దకు చేరడం, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల స్థాయిలో కొనసాగడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు కలిసొచ్చాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!