కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా బృంద సభ్యుల సామర్థ్యాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఒరాకిల్ సంస్థ, భారీ డేటా కేంద్రాల నిర్మాణానికి నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా రాబోయే నెలల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. లారీ ఎల్లిసన్ స్థాపించిన ఈ డేటాబేస్ సంస్థ, పునర్నిర్మాణ వ్యయాల కోసం అదనంగా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,600 కోట్లు) కేటాయించినట్లు త్రైమాసిక ఆదాయ నివేదిక అనంతరం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు తెలియజేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి సంస్థ పునర్నిర్మాణ నిధులు మొత్తం 2.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.19,320 కోట్లు) చేరాయి. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఒరాకిల్ వేలాది ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
భారీ ఏఐ డేటా కేంద్రాలను నిర్మించాలనే ప్రణాళికల నేపథ్యంలో పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం సంస్థ రుణాలు కూడా తీసుకోవాల్సి రావొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వచ్చే త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించకుండా పునర్నిర్మాణ ప్రణాళికను 500 మిలియన్ డాలర్లకు పెంచడం అసాధ్యం అని ఆర్బీసీ విశ్లేషకుడు రిషి జలూరియా అభిప్రాయపడ్డారు. సాధారణంగా “పునర్నిర్మాణం” అనే పదం ఉద్యోగుల తొలగింపులకు సంకేతంగా ఉపయోగిస్తారని, ఈసారి ఆ చర్యలు గతంతో పోలిస్తే మరింత విస్తృతంగా ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
గత ఏడాది ఆగస్టు–సెప్టెంబర్ మధ్యకాలంలో ఒరాకిల్ అమెరికా, కెనడా, భారత్‌లలో 3,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో మధ్యస్థాయి ఉద్యోగులపై ఈ ప్రభావం పడినట్లు వర్గాలు తెలిపాయి. తాజా లేఆఫ్‌లు ఏ విభాగాల్లో ఉంటాయి? ఎంత మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది? అనే విషయాలు ఇంకా స్పష్టత రాలేదు. అయితే వేలాది ఉద్యోగులను తగ్గించే ప్రణాళికను ఒరాకిల్ సిద్ధం చేస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ అంశంపై ఒరాకిల్ నుంచి అధికారిక స్పందన మాత్రం ఇంకా వెలువడలేదు.












.jpg&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!