

భారత విమానయాన రంగం 2030 నాటికి సంవత్సరానికి సుమారు 50 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే స్థాయికి చేరగలదని నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) సీఈఓ బీవీజేకే శర్మ అంచనా వేశారు. 2047 నాటికి ఈ సంఖ్య 100 కోట్లకు చేరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయ విమానయాన సంస్థలు ఇచ్చిన 1000కు పైగా కొత్త విమానాల ఆర్డర్లు సామర్థ్య విస్తరణకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
నిన్న జరిగిన ‘ఎయిర్‌పోర్ట్ 360 ఎక్స్‌పో 2026’లో ఆయన మాట్లాడుతూ, భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అగ్ర మూడు విమానయాన మార్కెట్లలో ఒకటిగా ఉందని తెలిపారు. 2025లో దేశం 41.2 కోట్ల ప్రయాణికులను మరియు 35 లక్షల టన్నుల సరుకును రవాణా చేసిందని, ఇది కొవిడ్‌కు ముందు కాలంతో పోలిస్తే 20 శాతం అధికమని చెప్పారు. ప్రస్తుతం వృద్ధి వేగంగా ఉన్నప్పటికీ, 2044 నాటికి ఇది 5.6 శాతానికి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, 2047 నాటికి వార్షిక ప్రయాణికుల సంఖ్య 100 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం 160 విమానాశ్రయాలు కార్యకలాపాల్లో ఉండగా, పెట్టుబడుల పెరుగుదలతో విమానయాన రంగం ఆర్థిక వ్యవస్థకు సుమారు 54 బిలియన్ డాలర్లు (రూ.5 లక్షల కోట్లకు పైగా) అందిస్తూ లక్షల ఉద్యోగాలను సృష్టిస్తోందని తెలిపారు. అలాగే, నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ సామర్థ్యాన్ని దశలవారీగా 2032 నాటికి 9 కోట్ల ప్రయాణికులకు పెంచనున్నట్లు వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!