

భారతీయులకు బంగారం ఎంత సెంటిమెంట్‌గా భావిస్తారో, వెండికీ అంతే ప్రాధాన్యం ఉంది. పూజా సామాగ్రి నుంచి ఆభరణాల వరకు ప్రతి ఇంట్లో వెండి వినియోగం కనిపిస్తుంది. అయితే అత్యవసర ఆర్థిక అవసరాల సమయంలో బంగారాన్ని తాకట్టు పెట్టినంత సులభంగా వెండిని బ్యాంకుల ద్వారా నగదుగా మార్చుకునే అవకాశం ఇప్పటివరకు అందుబాటులో లేదు. ఈ లోటును భర్తీ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెండిని కూడా అధికారిక పూచీకత్తుగా గుర్తిస్తూ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కమర్షియల్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, NBFC లలో ఒకే విధమైన పారదర్శక రుణ విధానం అమలులోకి వస్తుంది. రుణం కోసం తాకట్టు పెట్టే బంగారం, వెండి విషయంలో RBI స్పష్టమైన నిబంధనలు విధించింది. కేవలం ఆభరణాలు లేదా నాణేల రూపంలో ఉన్న లోహాలను మాత్రమే అంగీకరిస్తారు. బిస్కెట్లు, కడ్డీలు, ETFలు లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్ల పై రుణాలు ఇవ్వరు.
తాకట్టు పరిమితుల విషయంలో కూడా స్పష్టత ఇచ్చింది. బంగారు ఆభరణాలను గరిష్టంగా ఒక కిలో వరకు, బంగారు నాణేలను 50 గ్రాముల వరకు మాత్రమే తాకట్టు పెట్టవచ్చు. అదే విధంగా వెండి ఆభరణాలను 10 కిలోల వరకు, వెండి నాణేలను 500 గ్రాముల వరకు తాకట్టు పెట్టుకునే అవకాశం ఉంటుంది.
తాకట్టు పెట్టిన వెండి విలువ ఆధారంగా రుణ శాతం నిర్ణయిస్తారు. రూ.2.5 లక్షల వరకు రుణం తీసుకుంటే 85 శాతం వరకు, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80 శాతం, రూ.5 లక్షలకు మించిన రుణాలకు 75 శాతం వరకు రుణం లభిస్తుంది. వెండి విలువను లెక్కించేటప్పుడు ఆభరణాల్లోని రాళ్లు లేదా ఇతర లోహాలను మినహాయించి, కేవలం స్వచ్ఛమైన లోహం విలువనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ధరలను ప్రామాణికంగా ఉపయోగిస్తారు.
ఈ కొత్త పాలసీలో వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేశారు. రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత తాకట్టు పెట్టిన ఆభరణాలను 7 పని దినాల్లోపు తప్పనిసరిగా కస్టమర్‌కు తిరిగి ఇవ్వాలి. ఒకవేళ బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థల వైపు నుంచి ఆలస్యం జరిగితే, సదరు సంస్థ రోజుకు రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వెండి వస్తువులను ఎక్కువగా కలిగి ఉంటారు. ఇప్పటివరకు వెండిని తాకట్టు పెట్టాలంటే వారు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలు చెల్లించాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు లభించనున్నాయి. బంగారంతో పోలిస్తే సామాన్యుల వద్ద వెండి నిల్వలు ఎక్కువగా ఉండటంతో, ఈ నిర్ణయం వెండిని కూడా లిక్విడ్ అసెట్‌గా మార్చనుంది. మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో సామాన్యులకు ఇది అతిపెద్ద ఊరటనిచ్చే చర్యగా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!