

అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం (2025-26) భారత్ సముద్ర మత్స్య ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి మొత్తం 19.32 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి కాగా, వాటి విలువ 828 కోట్ల డాలర్లు (సుమారు రూ.72,325 కోట్లు)గా నమోదైనట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11.2 శాతం అధికం. ఇందులో రొయ్యల ఎగుమతుల వాటా అత్యధికంగా ఉండి, 551 కోట్ల డాలర్లు (సుమారు రూ.47,973 కోట్లు)గా ఉంది. విలువ పరంగా రొయ్యల ఎగుమతులు 6.35 శాతం, పరిమాణ పరంగా 4.6 శాతం పెరిగాయి. అమెరికాకు ఎగుమతులు కొంత తగ్గినా, యూరప్ మరియు చైనా మార్కెట్లు భారత్కు మద్దతుగా నిలిచాయి.
ఇక ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే కూడా బలమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో కంపెనీ రూ.6,723.73 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.1,110.9 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 27.18 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం 22.73 శాతం వృద్ధితో రూ.6,766.24 కోట్లకు చేరింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!