సుంకాల భారం ఉన్నప్పటికీ భారత ఫార్మా ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి ఎనిమిది నెలల్లోనే ఫార్మాస్యూటికల్ ఎగుమతులు 2,048 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.84 లక్షల కోట్లు) చేరాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే సుమారు 6.5 శాతం వృద్ధి అని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యేకంగా నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాలకు భారత ఔషధాల ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్–నవంబర్ మధ్యకాలంలో నైజీరియా 17.9 కోట్ల డాలర్లు, బ్రెజిల్ 10 కోట్ల డాలర్ల విలువైన ఔషధాలను భారత్ నుంచి దిగుమతి చేసుకున్నాయి. ప్రస్తుతం మొత్తం భారత ఫార్మా ఎగుమతుల్లో నైజీరియా వాటా 14 శాతానికి చేరడం గమనార్హం. ట్రంప్ సుంకాలపై ఆందోళనలు ఉన్నప్పటికీ, వాటి ప్రభావం అమెరికాకు జరిగే భారత ఫార్మా ఎగుమతులపై పడలేదు. ఫలితంగా, గత ఏడాది ఏప్రిల్–నవంబర్ మధ్యకాలంలో భారత్ నుంచి జరిగే మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 31 శాతం వాటాతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది.
ఇక ఫ్రాన్స్, నెదర్లాండ్, కెనడా, జర్మనీ, దక్షిణాఫ్రికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారత్ నుంచి పెద్ద ఎత్తున ఔషధాలను దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో నెదర్లాండ్కు జరిగిన భారత ఫార్మా ఎగుమతులు, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 5.8 కోట్ల డాలర్లు పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వృద్ధి ఇదే వేగంతో కొనసాగితే, గత ఆర్థిక సంవత్సరం నమోదైన 3,047 కోట్ల డాలర్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మా ఎగుమతులు 9 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.










.png&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!