

ఐటీ రంగానికే పరిమితం కాకుండా గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలకు కూడా హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఫిక్కీ–అనరాక్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది మార్చి నాటికి నగరంలో ఏర్పాటైన జీసీసీల సంఖ్య దాదాపు 515కు చేరింది. వీటిలో సుమారు మూడు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వచ్చే 12 నెలల్లో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో మరో 50 నుంచి 70 జీసీసీలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.
బహుళజాతి సంస్థలు జీసీసీల ఏర్పాటుకు నిర్వహణ వ్యయాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల లభ్యత, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ అనుకూల వ్యాపార విధానాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ నాలుగు అంశాల్లో హైదరాబాద్ బలంగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఏర్పాటైన జీసీసీల్లో దాదాపు 20 శాతం ఇక్కడే ఉన్నాయి. కృత్రిమ మేధ ప్రభావంతో ఐటీ రంగంలో నియామకాలు తగ్గుతున్నప్పటికీ జీసీసీల విస్తరణ కొనసాగుతోంది. ఐటీ కంపెనీలతో పోలిస్తే జీసీసీలు 20 నుంచి 30 శాతం అధిక వేతనాలు అందిస్తుండటంతో నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులు వాటివైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌లో ఐటీ, జీసీసీల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 11 లక్షలకు చేరుతుందని అంచనా.
జీసీసీల పెరుగుతున్న సంఖ్య హైదరాబాద్ స్థిరాస్తి రంగానికీ ఊతమిస్తోంది. 2021లో జీసీసీలు 19 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకోగా, 2025 నాటికి అది 45 లక్షల చదరపు అడుగులకు చేరింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 30 లక్షల చదరపు అడుగులకు పైగా కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. దీంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కార్యాలయ స్థలానికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో చదరపు అడుగుకు రూ.95 నుంచి రూ.115 వరకు అద్దెలు ఉన్నట్టు ఫిక్కీ–అనరాక్ నివేదిక తెలిపింది. జీసీసీల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వచ్చే కొన్నేళ్లలో మరో 3.6 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు సిద్ధమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!