

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ కంపెనీలకు తమ వ్యాపార ఆలోచనలను పరిచయం చేసేందుకు వేదికగా ఈ నెల 20న హైదరాబాద్‌లో హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (HES)-2026 జరగనుంది. TiE హైదరాబాద్ చాప్టర్, హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూరియల్ ఎకోసిస్టమ్ కలెక్టివ్ (HEECT) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి. తమ వినూత్న వ్యాపార ఉత్పత్తులు, సేవలను వెంచర్ క్యాపిటలిస్టులకు పరిచయం చేసేందుకు వెయ్యికి పైగా స్టార్టప్ కంపెనీల నుంచి దరఖాస్తులు అందినట్లు TiE హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు కాకర్ల మురళి తెలిపారు. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లను పెట్టుబడిదారులతో అనుసంధానించడం, వినూత్న వ్యాపారాలకు గుర్తింపు కల్పించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 50 వినూత్న స్టార్టప్ కంపెనీలను ఎంపిక చేసి, వాటి వివరాలతో ఒక పుస్తకాన్ని ప్రచురించనున్నట్లు మురళి వెల్లడించారు. వినూత్న వ్యాపార ఆలోచనలతో ముందుకు వచ్చే స్టార్టప్‌లకు HES-2026 చక్కటి వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఈ సదస్సులో హైదరాబాద్ ఏంజెల్స్‌తో పాటు 25 వెంచర్ క్యాపిటల్ (VC) ఫండ్స్ కూడా పాల్గొననున్నాయి. దీంతో స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడిదారులతో నేరుగా మాట్లాడే అవకాశం లభించడంతో పాటు, నిధుల సమీకరణ, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించేందుకు వీలుంటుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి, నూతన ఆవిష్కరణలకు మరింత ఊతమిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!