

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు–డిసెంబరు త్రైమాసికంలో రూ.4,076 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.4,591 కోట్లతో పోలిస్తే 11.2 శాతం తక్కువ. అయితే కంపెనీ కార్యకలాపాల ఆదాయం 13.3 శాతం పెరిగి రూ.33,872 కోట్లకు చేరింది.
బలమైన ఆదాయ వృద్ధితో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 15 బిలియన్ డాలర్లను (సుమారు రూ.1.35 లక్షల కోట్లు) అధిగమించే అవకాశముందని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికంలో సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఆర్డర్లు లభించాయి. సాఫ్ట్వేర్ ఆదాయం స్థిర కరెన్సీ ప్రాతిపదికన త్రైమాసికంగా 28.1 శాతం, వార్షికంగా 3.1 శాతం పెరిగిందని సీఈఓ సి.విజయకుమార్ తెలిపారు.
ఈ త్రైమాసికంలో 2,852 మంది ఫ్రెషర్లను నియమించగా, డిసెంబరు చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,26,379కు చేరింది. అధునాతన నైపుణ్యాలున్న ఫ్రెషర్లకు సంవత్సరానికి రూ.18–22 లక్షల వేతనం చెల్లించేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది.
2025–26 సంవత్సరానికి విక్రయ వృద్ధి అంచనాను స్థిర కరెన్సీ ప్రాతిపదికన 4–4.5 శాతంగా నిర్ధారించింది. సేవల విభాగంలో విక్రయ వృద్ధి అంచనాను 4.75–5.25 శాతానికి పెంచింది. మొత్తం ఆదాయ వృద్ధి అంచనాను 17–18 శాతంగా యథాతథంగా ఉంచింది. కొత్త లేబర్ కోడ్ల అమలుతో ఉద్యోగుల ప్రయోజనాల కోసం రూ.9,560 కోట్ల కేటాయింపులు చేసినట్లు తెలిపింది. అలాగే, ఒక్కో షేరుకు రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!