

దేశంలో సిమెంట్ ధరలు అక్టోబర్‌లో మరోసారి పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ బ్రోకింగ్ నివేదిక పేర్కొంది. బస్తాపై రూ.5 నుంచి రూ.20 వరకు ధర పెంపు ఉండొచ్చని అంచనా వేసింది. జులై, ఆగస్టు నెలల్లో పెద్దగా మార్పులేని సిమెంట్ ధరలు.. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా సగటున బస్తాకు రూ.7 చొప్పున పెరిగి సుమారు రూ.356కి చేరాయి. దక్షిణాది మార్కెట్లలో సగటు పెరుగుదల బస్తాకు రూ.11గా నమోదైంది. సిమెంట్ తయారీ, రవాణా ఖర్చులపై ఇంధన ధరల ప్రభావం ఉండటంతో కంపెనీలు మరోసారి ధరలను సవరించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
సెప్టెంబర్‌లో కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా నిర్మాణ కార్యకలాపాలు మందగించినప్పటికీ.. వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్మాణ రంగం చురుగ్గా కొనసాగింది. దీంతో సిమెంట్‌కు డిమాండ్ కొనసాగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. కంపెనీల బిల్లింగ్ రేట్లు పెరిగినప్పటికీ, విక్రయ లక్ష్యాలను చేరుకునేందుకు కొందరు డీలర్లు పాత ధరలకే విక్రయించడం వల్ల ఆ భారమంతా ఇంకా వినియోగదారులపై పడలేదని నివేదిక పేర్కొంది. అక్టోబర్‌లో డిమాండ్ ఎలా ఉంటుందనే దానితో పాటు డీలర్ల అంగీకారంపై ధరల పెంపు ఆధారపడి ఉంటుందని తెలిపింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!