

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో గిరాకీ కొనసాగింది. స్థిరాస్తి కన్సల్టింగ్ సంస్థలు అనరాక్, కొలియర్స్ ఇండియా నివేదికల ప్రకారం.. హైదరాబాద్‌లో కొత్త ఇళ్ల అమ్మకాలు 15 శాతం, కార్యాలయ స్థలాల లీజింగ్ 47 శాతం వృద్ధి సాధించాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాల లీజింగ్ వార్షిక ప్రాతిపదికన 9 శాతం పెరిగి 18.7 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. కార్పొరేట్ సంస్థల విస్తరణ, కో-వర్కింగ్, మేనేజ్డ్ ఆఫీస్ ఆపరేటర్ల నుంచి పెరిగిన డిమాండ్ ఇందుకు ప్రధాన కారణాలుగా కొలియర్స్ ఇండియా పేర్కొంది. జనవరి–సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా మొత్తం కార్యాలయ లీజింగ్ 7 శాతం పెరిగి 54.4 మిలియన్ చదరపు అడుగులకు చేరగా.. ఇందులో కో-వర్కింగ్, మేనేజ్డ్ ఆఫీస్ ఆపరేటర్ల వాటా 23 శాతంగా ఉంది.
టెక్నాలజీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలతో పాటు బహుళజాతి సంస్థలు ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. 2026 ప్రథమార్థంలో ఫ్లెక్స్ సీట్ లీజింగ్‌లో జీసీసీల వాటా 44 శాతంగా నమోదైంది. ఇదిలా ఉండగా.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జులై–సెప్టెంబర్‌లో 1,00,220 ఇళ్లు విక్రయమైనట్లు అనరాక్ తెలిపింది. గతేడాది ఇదే కాలంలోని 97,080 యూనిట్లతో పోలిస్తే ఇది 3 శాతం ఎక్కువ. ఇళ్ల విక్రయాల విలువ 2 శాతం పెరిగి రూ.1.55 లక్షల కోట్లకు చేరింది. సగటు ఇళ్ల ధరలు 7 శాతం పెరిగాయి. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు కలిసి మొత్తం అమ్మకాల్లో 48 శాతం వాటా సాధించాయి. దసరా, దీపావళి పండగల నేపథ్యంలో వచ్చే త్రైమాసికంలో గృహ కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!