

ఆంధ్రప్రదేశ్‌లో బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ కేంద్రాన్ని వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని సూచించారు. తిరుపతి సమీపంలోని సత్యవేడు మండలం రాళ్లకుప్పం, వానల్లూరు గ్రామాల వద్ద రూ.2,500 కోట్ల పెట్టుబడితో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ కేంద్రంలో అత్యాధునిక తయారీ విభాగంతో పాటు పరీక్షా మార్గం, పరిశోధనా కేంద్రం, సరఫరాదారుల పారిశ్రామిక వేదికను కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఏడాదికి 9 లక్షల మోటార్ సైకిళ్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. త్వరలో విద్యుత్ ఆధారిత కొత్త మోడల్‌ను కూడా తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి బుల్లెట్ మోటార్ సైకిల్ నమూనాలను పరిశీలించి, శిరస్త్రాణం ధరించి వాహనంపై కూర్చొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!