

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్న లక్షలాది మంది ఇన్వెస్టర్లకు సెబీ పెద్ద శుభవార్త చెప్పింది. పెట్టుబడిదారులపై పడుతున్న ఫీజుల భారాన్ని తగ్గించేందుకు, అలాగే ఛార్జీల్లో పారదర్శకత పెంచేందుకు సెబీ కొత్త నియమాలను ప్రకటించింది. SEBI (Mutual Funds) Regulations 2026 పేరుతో జారీ చేసిన ఈ మార్పులు దేశవ్యాప్తంగా ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు నేరుగా లాభం చేకూర్చనున్నాయి. ఇప్పటివరకు ఒకేసారి వసూలు చేస్తున్న టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (TER) ను మూడు విభాగాలుగా విడదీసింది. కొత్త విధానంతో పెట్టుబడిదారులు 5–7 బేసిస్ పాయింట్ల వరకు తక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉందని అంచనా.
కొత్త నిబంధనల ప్రకారం, మ్యూచువల్ ఫండ్ ఛార్జీలు ఇప్పుడు మూడు విభాగాలుగా ఉండనున్నాయి — బేస్ ఎక్స్పెన్స్ రేషియో, బ్రోకరేజ్, చట్టబద్ధ పన్నులు. బేస్ ఎక్స్పెన్స్ రేషియోను ఫండ్ నిర్వహణ ఖర్చులుగా పరిగణిస్తారు. కొనుగోలు, అమ్మకాల సమయంలో వచ్చే లావాదేవీ ఖర్చులను బ్రోకరేజ్‌గా ప్రకటిస్తారు. GST, స్టాంప్ డ్యూటీ, ఎక్స్ఛేంజ్ ఫీజులు వంటి రుసుములు చట్టబద్ధ పన్నులుగా వేరు చూపాలని సెబీ ఆదేశించింది. ఇంతకుముందు ఈ అన్ని ఖర్చులు ఒకేచోట చూపించడంతో పెట్టుబడిదారులకు స్పష్టత ఉండేది కాదు. కొత్త విధానం పెట్టుబడిదారులకు పూర్తిస్థాయి క్లారిటీని అందించనుంది.
ఇకపోతే, 2025లో అంతర్జాతీయ మార్కెట్లలో భారీ ఒడుదొడుకులు, రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు, అమెరికా నిర్ణయాలు వంటి అంశాలు పెట్టుబడిదారులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీనివల్ల మ్యూచువల్ ఫండ్స్ పనితీరు కూడా తగ్గి, అనేక ఇన్వెస్టర్లు నష్టాలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, సెబీ తీసుకొచ్చిన తాజా మార్పులు పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచడంతో పాటు, మ్యూచువల్ ఫండ్స్‌లో పారదర్శకత, విశ్వసనీయతను పెంచుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిగా మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపికచేసే వారికి ఈ రూల్స్ పెద్ద సహాయంగా ఉండనున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!