

దేశవ్యాప్తంగా బంగారం, వెండి కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పసిడి, వెండిపై దిగుమతి సుంకాన్ని వెంటనే అమల్లోకి వచ్చేలా 15 శాతానికి పెంచగా, ప్లాటినంపై సుంకాన్ని 15.4 శాతానికి పెంచింది. దీనికి అదనంగా 3 శాతం జీఎస్టీ కూడా వర్తించనుంది. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల మధ్య విదేశీ మారకద్రవ్య నిల్వల తరుగుదలను అరికట్టడం, అనవసర దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముడి చమురు, ఎరువుల వంటి కీలక దిగుమతులకే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.
ప్రధాని నరేంద్రమోదీ అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గించాలని పిలుపునిచ్చిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెరిగిన సుంకాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు మరింత భారమయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు డాలర్ల వినియోగాన్ని తగ్గించి రూపాయి విలువను కాపాడటమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. అయితే అధిక సుంకాలతో అక్రమ రవాణా, బిల్లు లేని విక్రయాలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!