

భర్త మృతి తర్వాత తీవ్ర మనోవేదనలో ఉన్న ఓ మహిళకు స్టాక్‌మార్కెట్ వ్యవస్థలోని నిర్లక్ష్యం పెద్ద నష్టాన్ని మిగిల్చింది. తనకు చెందిన డీమ్యాట్ ఖాతాలోని షేర్లను అనుమతి లేకుండా బదిలీ చేసి, బ్యాంకులు వాటిని స్వాధీనం చేసుకుని విక్రయించాయని ఆమె న్యాయం కోసం పోరాడారు. చివరకు బాంబే హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. డిపాజిటరీ పార్టిసిపెంట్ల (డీపీలు) తప్పులకు డిపాజిటరీలు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేస్తూ, ఆమెకు చెందిన రూ.86 లక్షల విలువైన షేర్లను 9% వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది.
ఈ కేసులో, ముంబయికి చెందిన దక్షా నరేంద్ర భవ్సార్ డీమ్యాట్ ఖాతాలోని షేర్లను బీఆర్‌హెచ్ వెల్త్ క్రియేటర్స్ అనుమతి లేకుండా తమ ఖాతాలకు బదిలీ చేసి, వాటిని తనఖా పెట్టి బ్యాంక్ రుణం తీసుకుంది. ఆ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు షేర్లను విక్రయించింది. ఇలాంటి మోసాలు వేలాది ఖాతాదారులకు జరిగినట్లు వెల్లడైంది.
షేర్లు మాయమైన తర్వాత దక్షా ఎన్ఎస్ఈ, అనంతరం సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రైబ్యునల్ తీర్పును సీడీఎస్ఎల్ హైకోర్టులో సవాలు చేసినప్పటికీ, న్యాయస్థానం ఆ వాదనలను తోసిపుచ్చింది. డీపీ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టానికి డిపాజిటరీ కూడా బాధ్యత వహించాలన్న తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం స్టాక్‌బ్రోకర్లు, డిపాజిటరీల తప్పుల వల్ల నష్టపోయిన మదుపరులకు దిశానిర్దేశం చేసే కీలక తీర్పుగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!