

అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, భారత్‌లో అత్యధిక ఉద్యోగులను కలిగి ఉన్న ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కృత్రిమ మేధ సామర్థ్యాల విస్తరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కృత్రిమ మేధ మౌలిక వసతులు మరియు డేటా కేంద్ర సేవల రంగంలో ఉన్న ఆస్ట్రేయా అనే సంస్థను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఒప్పంద ఆర్థిక విలువను కంపెనీ వెల్లడించలేదు. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఈ ఒప్పంద విలువ సుమారు 60 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,690 కోట్లు) వరకు ఉండవచ్చని అంచనా.
మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో కాగ్నిజెంట్ ఏకీకృత నికర లాభం 66.2 కోట్ల డాలర్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 66.3 కోట్ల డాలర్లతో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది. అదే సమయంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5.8 శాతం పెరిగి 540 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ సుమారు 25 వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికను ప్రకటించింది. తాజా త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 6,000 పెరిగి మొత్తం 3,57,600కు చేరినట్లు సంస్థ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!