

దేశంలో రెండో అతిపెద్ద పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ విమానాల తయారీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో బ్రెజిల్‌కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎంబ్రాయర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో ఎంబ్రాయర్ రీజినల్ ప్యాసింజర్ జెట్ విమానాల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేసేందుకు అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్తో ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇది మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు బలాన్నిస్తుందని భావిస్తున్నారు. 70 నుంచి 146 సీట్ల సామర్థ్యంతో ఉన్న ఈ జెట్ విమానాలు స్వల్ప, మధ్యదూర ప్రయాణాలకు ఉపయోగపడతాయి.
ఈ ఫైనల్ అసెంబ్లీ యూనిట్ దేశంలో ఫిక్స్డ్ వింగ్ ప్యాసింజర్ విమానాల తయారీలో తొలి కేంద్రంగా నిలవనుంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ నిర్వహణ, విమానాల ఎంఆర్ఓ, పైలట్ శిక్షణ వంటి రంగాల్లో ఉన్న అదానీ గ్రూప్, ఈ ఒప్పందంతో విమానాల తయారీ రంగంలోకి ప్రవేశిస్తోంది.
భారత మార్కెట్లో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఎంబ్రాయర్ గత ఏడాది ఢిల్లీలో తన కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం దాదాపు 50 ఎంబ్రాయర్ విమానాలు భారత్‌లో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సేవలందిస్తున్నాయి. ఈ అసెంబ్లీ యూనిట్ స్థలం, పెట్టుబడులు వంటి పూర్తి వివరాలు ఈ నెలాఖరులో హైదరాబాద్‌లో జరగనున్న ఏవియేషన్ షోలో వెల్లడయ్యే అవకాశముంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!