
సామాజిక మాధ్యమ వేదికల్లో విస్తరిస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించేందుకు స్పెయిన్ ప్రభుత్వం కీలక చర్యలను ప్రకటించింది. ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ హోడియో అనే సాంకేతిక సాధనాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. మాడ్రిడ్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద సాంకేతిక సంస్థల పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సాధనం ద్వారా డిజిటల్ వేదికల్లో ద్వేషపూరిత కంటెంట్ ఎంత మేర విస్తరిస్తోంది, దాని ప్రభావం ఎంత ఉందో శాస్త్రీయంగా అంచనా వేయగలమని ఆయన చెప్పారు.
హోడియో వ్యవస్థ ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమగ్ర నివేదికను సిద్ధం చేస్తుంది. ఈ ప్రాజెక్టును స్పానిష్ అబ్జర్వేటరీ ఆఫ్ రేసిజం అండ్ జెనోఫోబియా పర్యవేక్షిస్తుంది. ఏ సంస్థలు ద్వేషపూరిత కంటెంట్‌ను అడ్డుకుంటున్నాయి, ఏ సంస్థలు తగిన చర్యలు తీసుకోవడం లేదు అన్నది ఈ నివేదిక ద్వారా వెల్లడవుతుంది. అలాగే ఇలాంటి కంటెంట్ వ్యాప్తి ద్వారా ఏ వేదికలు లాభం పొందుతున్నాయో కూడా స్పష్టంగా తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
గత పది సంవత్సరాల్లో స్పెయిన్‌లో ద్వేషపూరిత నేరాలు 41 శాతం పెరగడం ప్రభుత్వం ఆందోళనకు కారణమైంది. ఇకపై సామాజిక మాధ్యమ సంస్థలు తమ వేదికల్లో అనుమతించే ప్రతి విద్వేషపూరిత అంశానికి బాధ్యత వహించాల్సిందేనని ప్రధానమంత్రి తెలిపారు. ఇప్పటికే పదహారేళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమ వినియోగాన్ని నిషేధించే ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎక్స్, మెటా, టిక్‌టాక్ వంటి వేదికలపై దర్యాప్తు చేయాలని కూడా కోరింది. యూరోపియన్ యూనియన్‌లో డిజిటల్ సర్వీసెస్ చట్టం అమల్లో ఉన్నప్పటికీ స్పెయిన్ ప్రత్యేకంగా ఈ కొత్త సాధనాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!