

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ సముదాయాన్ని వేగంగా నిర్మిస్తోంది. మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు పునీత్ చందోక్ వెల్లడించిన వివరాల ప్రకారం, దక్షిణ భారత ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దేశంలో కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సేవలు, కోపైలెట్ 365 ఏఐ అసిస్టెంట్లకు దేశీయ మార్కెట్లో భారీ ఆదరణ లభిస్తోందని సంస్థ పేర్కొంది. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఐటీ మార్కెట్లలో భారత్ ముందంజలో ఉండటంతో మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది.
గత ఏడాది ప్రకటించిన రూ.1.45 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికలో కీలక భాగాన్ని హైదరాబాద్ డేటా సెంటర్ల విస్తరణకే కేటాయించింది. ఇప్పటికే పుణె, చెన్నై, ముంబయిలలో డేటా సెంటర్లు ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో నిర్మిస్తున్న సముదాయం దేశంలోనే అతి పెద్దదిగా నిలవనుంది. కొత్త డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం ప్రకారం వినియోగదారుల డేటాను దేశీయ సర్వర్లలో భద్రపరచాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారింది. షాద్‌నగర్, మేకగూడ, చందన్వెల్లి ప్రాంతాల్లో భారీ స్థాయిలో డేటా సెంటర్ క్యాంపస్‌లను నిర్మిస్తున్నారు. ఇదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు మైక్రోసాఫ్ట్ కోపైలెట్ సేవలను విస్తృతంగా వినియోగించడం వల్ల మౌలిక వసతుల అవసరం మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!