

ఈ ఏడాది కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని సత్య నాదెళ్ల వెల్లడించారు. కొత్తదనం అనే దశను దాటి, ఏఐ వాస్తవ ప్రపంచంలో ఎలా ఉపయోగపడుతోందనే అంశం పై అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
‘లుకింగ్ ఎహెడ్ టు 2026’ పేరిట రాసిన బ్లాగ్లో ఏఐ భవిష్యత్తు పై తన అభిప్రాయాలను నాదెళ్ల పంచుకున్నారు. ఇప్పటివరకు కొనసాగుతున్న ‘స్లాప్ వర్సెస్ సోఫిస్టికేషన్’ తరహా చర్చల నుంచి ముందుకు వెళ్లి, ఏఐ వల్ల నిజంగా సమాజానికి కలిగే ప్రయోజనాల పై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఏఐ మానవ సామర్థ్యాలకు ప్రత్యామ్నాయం కాదని, అవి మరింత మెరుగుపడేందుకు ఉపయోగపడే ఒక సాధనమని నాదెళ్ల స్పష్టం చేశారు. ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేసే సమయంలో ప్రోడక్ట్ డిజైన్తో పాటు సామాజిక ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వృత్తి జీవితానికి ఏఐ హానికరమని భయపడే దృక్పథాన్ని వదిలేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఏఐ పరిశ్రమ ప్రస్తుతం కొత్తదనం దశ నుంచి బయటపడి, మరిన్ని సవాళ్లను ఎదుర్కొనే కీలక దశలోకి ప్రవేశించిందని ఆయన వివరించారు. దశాబ్దాలుగా వేలాది సంస్థలకు సేవలు అందిస్తున్న ఆఫీస్, విండోస్ వంటి సాఫ్ట్వేర్ల స్థానంలో, భవిష్యత్తులో ఏఐ ఏజెంట్ల వినియోగం పెరుగుతుందని మైక్రోసాఫ్ట్ భావిస్తోందని తెలిపారు.
ఏఐను స్వతంత్ర మేధస్సుగా చూడకూడదని, మానవ ఆలోచనలను విస్తరించే, ప్రజలు తమ లక్ష్యాలను చేరుకునేందుకు తోడ్పడే టూల్గా చూడాలని నాదెళ్ల పేర్కొన్నారు. చివరికి ఏఐ ప్రభావం ఎంత ఉంటుందన్నది, ప్రజలు దాన్ని తమ దైనందిన జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నారనే విషయం పైనే ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు.
కోపైలట్ సహా అనుబంధ ఉత్పత్తులను మరింత బలోపేతం చేయడానికి అధునాతన ఏఐ మోడళ్ల పై మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతోందని నాదెళ్ల తెలిపారు. ఒక ఏఐ మోడల్ ఎంత శక్తివంతమైనదో, అలాగే దాన్ని ప్రజలు ఎలా వినియోగిస్తున్నారో అనే అంశాలే దీని అసలు ప్రభావాన్ని నిర్ణయిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!