

మెటా భారత్‌లో తన పెట్టుబడులను మరింత విస్తరిస్తూ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మెటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ జనార్ధన్ ప్రకారం, ఈ డేటా సెంటర్ కేవలం భారత వినియోగదారులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ఉపయోగించే సేవలకు మద్దతు ఇవ్వనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న 168 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ కేంద్రం మెటా గ్లోబల్ డిజిటల్ నెట్‌వర్క్‌లో కీలక భాగంగా మారనుంది.
భారత్‌లో భూమి, విద్యుత్, నెట్‌వర్క్ కనెక్టివిటీ, శీతలీకరణ సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు సమృద్ధిగా ఉండటం వల్లే ఈ పెట్టుబడి సాధ్యమైందని జనార్ధన్ తెలిపారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, సిలికాన్ డిజైన్ వంటి విభిన్న రంగాల్లో భారత్ ప్రతిభను అందిస్తున్న కొద్ది దేశాల్లో ఒకటిగా ఆయన పేర్కొన్నారు. దేశంలోని భారీ వినియోగదారుల వర్గం, సాంకేతిక రంగానికి అనుకూలమైన విధానాలు కూడా ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు.
అదనంగా, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లతో పాటు భవిష్యత్తులో రానున్న ఏఐ సేవలకు ఈ డేటా సెంటర్ మద్దతు ఇవ్వనుంది. అలాగే పరిశుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా దాదాపు 1 గిగావాట్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యానికి మద్దతు ఇచ్చే భాగస్వామ్యాలను కూడా మెటా ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!