

భారత్ అంతరిక్ష రంగంలో కీలకమైన నిర్మాణాత్మక మార్పు చోటుచేసుకోనుంది. ఇస్రో సాధారణ రాకెట్లు, ఉపగ్రహాల తయారీ వంటి రోజువారీ కార్యకలాపాల నుంచి క్రమంగా తప్పుకోనుందని ఇన్-స్పేస్ ఛైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకా వెల్లడించారు. SSLV, PSLV, LVM3 వంటి ఇప్పటికే పరిణతి చెందిన రాకెట్ సాంకేతికతలను వాణిజ్య ఉత్పత్తి, అసెంబ్లీ కోసం భారతీయ ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించనున్నారు.
ఈ మార్పుతో ఇస్రో అధునాతన పరిశోధనలు, కొత్త సాంకేతికతల అభివృద్ధి, డీప్ స్పేస్ శాస్త్రీయ మిషన్లపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే 120కుపైగా సాంకేతికతలను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసినట్లు సమాచారం. దేశీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం ఉన్న సుమారు 8 బిలియన్ డాలర్ల నుంచి 2033 నాటికి 44 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం మరింత కీలకం కానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!