

మెటా సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్.. వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కు పోటీగా సుదీర్ఘ వీడియోలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటివరకు ప్రధానంగా షార్ట్ వీడియోలు, రీల్స్‌కు ప్రాధాన్యమిచ్చిన ఈ ప్లాట్‌ఫామ్.. గరిష్ఠంగా 90 నిమిషాల నిడివి గల హారిజాంటల్ వీడియోలను వీక్షించే సదుపాయాన్ని పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌ను తొలుత బ్రెజిల్‌లో పరీక్షించగా, తాజాగా అమెరికాకూ విస్తరించినట్లు కంపెనీ వెల్లడించింది. పాడ్‌కాస్టర్లు, హాస్య కళాకారులు, ఇతర కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించడం ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం.
ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ సుదీర్ఘ వీడియోలకు సంబంధించిన చిన్న రీల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ మొబైల్ యాప్‌లో లింక్ చేయవచ్చు. ఆ రీల్‌ను క్లిక్ చేసినప్పుడు పూర్తి వీడియోను వీక్షించే అవకాశం వినియోగదారులకు లభిస్తుంది. మరోవైపు, ఎపిసోడ్ల రూపంలో రీల్స్‌ను రూపొందించుకునేందుకు వీలుగా ‘సిరీస్’ ఫీచర్‌పైనా ఇన్‌స్టాగ్రామ్ ప్రయోగాలు చేస్తోంది. మైక్రోడ్రామాలు, వీడియో సిరీస్‌లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి అమెరికాలో, వచ్చే ఏడాది ఇతర దేశాల్లోనూ దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కథనం పేర్కొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!