

ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద అందించే కనీస నెలవారీ పింఛను పెంపుపై త్వరలో చర్చ జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశం నవంబర్ 19న గుజరాత్‌లో జరగనున్న నేపథ్యంలో ఈ అంశం చర్చకు రావచ్చని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈపీఎస్ కింద కనీస నెలవారీ పింఛను రూ.1,000గా ఉంది. 2014 సెప్టెంబర్‌లో చివరిసారిగా దీనిని సవరించారు. పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని కనీస పింఛనును రూ.7,500కు పెంచాలని పెన్షనర్ల సంఘాలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ పెంపుపై ఇప్పటివరకు అధికారిక నిర్ణయం వెలువడలేదు.
ఈపీఎస్ నిబంధనల ప్రకారం, యజమాని చెల్లించే వాటాలో 8.33 శాతం పెన్షన్ నిధికి కేటాయిస్తారు. పెన్షన్ మొత్తాన్ని పెన్షనబుల్ వేతనం, పెన్షనబుల్ సర్వీస్ ఆధారంగా లెక్కిస్తారు. పెన్షనర్లు కోరుతున్న రూ.7,500కు బదులుగా కొంతమేర పెంపునకే ప్రభుత్వం మొగ్గు చూపవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, దీనిపై స్పష్టత రావాలంటే అదనంగా అవసరమయ్యే నిధులు, బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరగాల్సి ఉంటుంది. నవంబర్ 19న జరిగే సమావేశంలో ఈ అంశం చర్చకు వస్తుందా, కనీస పింఛను ఎంత పెరుగుతుంది, ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయాలు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టమవుతాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!