

గూగుల్ తన ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసింది. వ్యక్తిగత సమాచారాన్ని ఇతర గూగుల్ సేవలకు అందించేందుకు వినియోగదారులు అనుమతించినప్పుడు, జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్ నుంచి లభించే సమాచారాన్ని వ్యక్తిగతీకరించిన ప్రకటనల కోసం ఉపయోగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అక్టోబర్ 16, 2026న ఈ మార్పును చేర్చినట్లు నివేదికలు వెల్లడించాయి. గతంలో ఈ సేవల్లోని సమాచారాన్ని వ్యక్తిగతీకరించిన ప్రకటనల కోసం ఉపయోగించబోమని పేర్కొన్న నిబంధనకు తాజా మార్పు మినహాయింపును తీసుకొచ్చింది. గూగుల్ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఈమెయిల్స్, ఫొటోలు, ఇతర సేవలను జెమినీ, సెర్చ్ వంటి ఏఐ టూల్స్‌తో అనుసంధానించవచ్చు. దీనివల్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సమాధానాలు, సిఫార్సులు అందించడమే కాకుండా, వినియోగదారుల అనుమతులు, సెట్టింగులను బట్టి ప్రకటనలను కూడా వ్యక్తిగతీకరించే అవకాశం ఉంటుంది.
అయితే, వినియోగదారుల జీమెయిల్, డ్రైవ్, ఫొటోస్‌లోని సమాచారాన్ని ప్రకటనదారులు నేరుగా చూడలేరని గూగుల్ స్పష్టం చేసింది. పేర్లు, ఈమెయిల్ చిరునామాల వంటి వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని కూడా వారికి అందించబోమని తెలిపింది. జాతి, లైంగిక ధోరణి, మతం, ఆరోగ్యం వంటి సున్నితమైన అంశాల ఆధారంగా ప్రకటనలను వ్యక్తిగతీకరించబోమని పేర్కొంది. ఏఐ సేవల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత సమాచార భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న సమయంలో ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. తమ వ్యక్తిగత డేటాను ప్రకటనల కోసం ఉపయోగించడాన్ని పరిమితం చేయాలనుకునే వినియోగదారులు పర్సనల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానించిన యాప్‌లను పరిశీలించి, అవసరమైన వాటిని డిస్‌కనెక్ట్ చేయవచ్చు. గూగుల్ సెర్చ్ వ్యక్తిగతీకరణ సెట్టింగుల్లోకి వెళ్లి వ్యక్తిగతీకరించిన సిఫార్సులను నిలిపివేసే అవకాశమూ ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!