

నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు దర్శకుడిగానూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రియాలిటీ’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శరత్ కుమార్, సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తుండగా, దేవిక భట్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన ‘భజ గోవిందం’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమా మ్యూజికల్ జర్నీకి మంచి ఆరంభాన్ని అందించింది.
‘భజ గోవిందం.. భజ గోవిందం.. బ్రతుకే కోలాహలం!’ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్లో ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సంగీత ప్రియుల ఆదరణ పొందింది. పాటకు లభిస్తున్న స్పందనపై కిరణ్ అబ్బవరం సంతోషం వ్యక్తం చేస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘భజ గోవిందం’ ప్రతి ఇంటిలోనూ చోటు సంపాదించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రేక్షకుల స్పందన తనను భావోద్వేగానికి గురిచేసిందని పేర్కొన్నారు. వైకోమ్ విజయలక్ష్మి గాత్రం, సనారే సాహిత్యం, భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విడుదలకు ముందే పాటకు లభిస్తున్న ఆదరణతో ‘రియాలిటీ’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!